Sunday 31 May 2015

నాటకం లో పాత్ర ధారులం....

మన పాత్ర ముగింపు ఎలా ఉండబోతుందో తెలియని నాటకం లో అందరం పాత్రధారులమే.ఇందులో మనం అశాశ్వత పాత్ర ధారులం అన్న విషయాన్ని గుర్తుంచుకోకుండా దేని కోసమో వెంపర్లాడతాం.ఏదో దొరకలేదని ఏడుస్తాం.కొంతమందిని చూసి వెకిలిగా నవ్వుతాం.మన కంటే పేదరికంలో ఉన్న వారి దగ్గర మన ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఆరాట పడతాం.పక్క నున్న వారిపై పుకార్లు పుట్టిస్తాం.ఎవడో చెప్పిన చెడు ని విచక్షణ మరచి మరింతమందికి చెప్తాం.ఎదుటి వాడి మొహం పై మంచి మాటలు మాట్లాడి మనసులో మాత్రం వాడు మన కంటే పైకి ఎదగకూడదని బలంగా కోరుకుంటాం.అవసరాలు తీర్చుకోవటానికే అబద్ధపు బంధాలు ఏర్పరచుకుంటాం.అవసరం తీరాక వాటిని నిర్దాక్షణ్యంగా తెంచేస్తాం.మన కోసం ఆరాటపడే వారిని పట్టించుకోం.మనం ఇంకెవరి కోసమో,దేని కోసమో ఆరాటపడతాం.మనకేదైనా చెడు జరిగితే దానికి ఎవరినో బాధ్యులను చేస్తాం.నిజాన్ని అంగీకరించలేం అబద్ధానికి అలవోకగా ఆకర్షింపబడతాం.మనలోనే లోపాలను కుప్పలుగా ఉంచుకుని ఎదుటి వాడి తప్పులను ఎత్తి చూపిస్తాం.కిందపడిన వాడిని చూసి మొహం పై సానుభూతి చూపిస్తూ మనసులో మాత్రం విరగబడి నవ్వుతాం.వృద్ధాప్యం ఉంటుందనే విషయం మరచి యవ్వనపు అహంకారంతో విర్రవీగుతాం.జీవితం లో దెబ్బ తగిలిన వాడిని మాటలతో మరింత గాయపరుస్తాం,రాబందుల్లా పీక్కు తింటాం.ఎదుటి వాడి అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటాం.మనుషులను వ్యక్తిత్వాలని బట్టి కాకుండా వారి స్ధాయులను బట్టి గౌరవిస్తాం.పక్కనున్నోడి జీవితంలో తలదూరుస్తాం వాడి పరిస్థితేంటో తెలుసుకోకుండా నోటి కొచ్చిందంతా వాగుతాం.అందరం ఇలాగే ఉన్నామని కాదు కానీ అందరిలోనూ పైన చెప్పిన లక్షణాలలో కొన్నైనా తప్పకుండా ఉన్నాయి.మొత్తానికి మన నటనతో నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాం.రాక్షసానందం కావాలనుకునే వారికెవరికైనా మనం పాత్రధారులుగా ఉన్న ఈ నాటకం బోల్డంత వినోదాన్నిస్తుంది.

Friday 8 May 2015

గదిలోని గడియారం నాలాగే...

నా పుస్తకాలుండే గది లోని గడియారం ఎపుడూ ఆరేడు గంటలు నెమ్మదిగా తిరుగుతుంది.రెండు సార్లు బ్యాటరీ మార్చినా లాభం లేదు.నాలాగే నిరాశగా,నెమ్మదిగా నడుస్తుంది.అది నా పరిస్థితి ని ప్రతిబింబిస్తుందనిపించింది.దానిని మరి బాగు చేయించే ప్రయత్నం చేయలేదు.నేను వెనక్కి నడుస్తుందని చెబుతున్న గడియారాన్ని చూస్తే ఆశావాదులు ముందుకు నడుస్తుంది గడియారం అనవచ్చు.కానీ నా దృష్టిలో మాత్రం అది వెనకనే నడుస్తుంది.దానినలా చూస్తే అది నాకు తోడు గా నడుస్తుందనిపిస్తుంది.అందుకే సమయాన్ని తప్పు గా చూపే ఆ గడియారాన్ని ఆత్మీయంగా చూసుకుంటాను.

Monday 4 May 2015

నా నమ్మకం నిజమవుతుంది కదా...

ఎప్పుడూ బెంగగా ఉంటుంది.నా చేతి వేళ్ల మధ్యలో నీ చేతి వేళ్లు పెట్టి గట్టిగా నా చేతిని పట్టుకున్నావు ఒకసారి ఎనిమిదేళ్ల క్రితం ఏదో చిన్న విషయానికి నేను కంగారు పడుతుంటే.అపుడు చాలా ధైర్యం గా అనిపించింది.ఇపుడు ఎపుడూ నీ చేతిని పట్టుకుంటే అదే ధైర్యం వస్తుంది.చివరికి నీ ఆరోగ్యం సహకరించక నీ చివరి క్షణాల్లో నువ్వున్నా కూడా అపుడు కూడా అదే ధైర్యం వస్తుంది నీ చేయి పట్టుకుంటే.కానీ నిన్ను కనులారా చూసుకునే భాగ్యమే కలగలేదు చాలా సంవత్సరాల నుంచి.అయినా నా ప్రేమ తో నీ ప్రాణాన్ని పదిలంగా కాపాడుకోగలననే నా నమ్మకం అబద్ధం అవదు కదా?నిజం చెప్పు

నాతో పాటు బాధను మోస్తూ. ..

ఇల్లంతా వెలితిగా...నాతో పాటు బాధను మోస్తూ...పెళ్ళి చేసుకుని అత్తారిల్లకు వెళుతున్న ఆడపిల్లలని చూసి మాకు నిన్నలా చూసే అదృష్టం కల్పించవా అని దీనంగా అడుగుతున్న ఇంట్లో వాళ్ళు.... వీళ్ల ఎదురుచూసేది ఎప్పటికీ ఎండమావే అని తెలిస్తే.....

Sunday 3 May 2015

మేడపై అదే స్థానంలో.....

సాయంత్రం మేడపై కూర్చున్నాను.ఏడున్నర సంవత్సరాల క్రితం నీ ఆరోగ్యం గురించి చెప్పి ఎన్నాళ్లో బ్రతకను నన్ను మరచిపో అని చెప్పినరోజు రాత్రి జీవితం మొత్తం చీకటైపోయిందని మేడపై అదే స్థానంలో మోకాళ్లపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాను.ఇప్పటికీ కళ్లు కన్నీటితో తడిగానే ఉన్నాయి.ఆ గాయం ఇప్పటికీ అంతే పచ్చిగా ఉంది.నాకు తెలుసు ఊపిరాగిపోయే వరకు ఆ గాయం అంతే పచ్చిగా ఉంటుంది.

Saturday 2 May 2015

కొత్త బ్లాగు

నా గురించి నాకు మాత్రమే అర్ధమయ్యే కొన్ని భావాలను రాసుకునేందుకు.ఇంతకు ముందు ఇంకొక బ్లాగ్ రాస్తున్నాను.కానీ కొన్ని అసంపూర్ణ వాక్యాలలో నన్ను ఆవిష్కరించుకునే,అర్ధం చేసుకునే ప్రయత్నం లో భాగమే ఈ కొత్త బ్లాగు.కొన్ని ఆలోచనలు వాటికి రూపం ఉండదు కేవలం నా ఊహలలోనే ఉన్న అలాంటి కొన్ని ఆలోచనలను అక్షర రూపం లో చూసుకునేందుకు ఈ బ్లాగు.