Saturday 26 September 2015

దైన్యం

మేరు పర్వతంలా ఘనీభవించిన దైన్యం కరిగి కన్నీరులా మారితే ఆ అంతులేని కన్నీటి సముద్రాన్ని నేను.ఒంటరితనపు చిరునామా నేను.గమ్యం లేని ఎడతెగని ఎడారి వెంట ప్రయాణాన్ని నేను.

Wednesday 23 September 2015

నీపై నా ప్రేమ

జీవితాంతం నిరాశ, నిస్పృహలతో అలసిపోయి,బరువెక్కిన హృదయంతో చీకటిలో మగ్గిపోతూ  రేపటి ఉదయం ఎన్ని గాయాలను చేసేందుకు వేచి ఉందో అనే భయంతో బెదురు చూపులు చూస్తున్న కంటి నుంచి జారిపడుతున్న కన్నీటి సంద్రాన్ని నేను.
                 నిన్ను మరచిపొమ్మంటున్న వీళ్లకి తెలియదా నవమాసాలు ఆశగా ఎదురుచూసిన బిడ్డని ప్రేమగా పొత్తిల్ల లోకి తీసుకోబోయే సమయంలో ఎవరో బిడ్డని లాక్కుని తీసుకుపోయి కంటి ముందే తనని చిత్ర హింసలు పెట్టే పరిస్థితిలో తల్లి చూసే ప్రత్యక్ష నరకం.అలాగే ఉంటుంది కదా నిన్ను వదిలిపెట్టాల్సి వస్తే నా పరిస్థితి.నువ్వు నేను వేరు వేరా?నీపై నాకున్నది ఎటువంటి వికారాలకు చోటు లేని తల్లి ప్రేమ కి ఏ మాత్రం తీసిపోని పవిత్రమైన ప్రేమ కదా.
                   

Thursday 17 September 2015

సమాజం నిర్ణయించిన నా విలువ

ప్రక్కన వేరే ఏదైనా సంఖ్య లేకపోతే సున్నాకి విలువ లేనట్లు పెళ్లి చేసుకుని భర్త అనే మగాడు ప్రక్కన ఉంటేనే నాకంటూ ఒక విలువ ఉంటుందంట.లేదంటే నేను కూడా ఒంటరి సున్నా లాగా ఎటువంటి విలువ లేకుండా ఉండిపోతానంట.ఇది సమాజం నాకు నిర్ణయించిన విలువ.తనని ప్రేమించటం మొదలు పెట్టిన రోజే తనతో మానసికంగా వివాహం జరిగిందని,తనకి వచ్చిన ప్రాణాంతకమైన వ్యాధి గురించి తను చెప్పినపుడు నేను పెట్టిన కన్నీరు సాక్షిగా నా జీవితంలో తనకి తప్ప ఇంకెవరికీ చోటు లేదని నా మనసు బలంగా నిర్ణయించుకున్నదని వీరందరికీ తెలియదు కదా.తెలిసినా ఆ భావంలోని పవిత్రత వీరికి అర్థం కాదు.తను,నేను సమాజం దృష్టిలో పెళ్లి చేసుకోకపోయినా, ఒకరినొకరం చాలా సంవత్సరాల నుంచి చూసుకోకపోయినా మా మధ్య ఉన్న దృఢమైన బంధం గురించి వీరందరికీ అర్థం కాదు కదా.అందుకే ఏమీ తెలియని వీరందరూ పెళ్లి వద్దంటున్న నా విలువను ఒంటరి సున్నా అంటూ నిర్ణయించేస్తున్నారు.