Sunday 31 May 2015

నాటకం లో పాత్ర ధారులం....

మన పాత్ర ముగింపు ఎలా ఉండబోతుందో తెలియని నాటకం లో అందరం పాత్రధారులమే.ఇందులో మనం అశాశ్వత పాత్ర ధారులం అన్న విషయాన్ని గుర్తుంచుకోకుండా దేని కోసమో వెంపర్లాడతాం.ఏదో దొరకలేదని ఏడుస్తాం.కొంతమందిని చూసి వెకిలిగా నవ్వుతాం.మన కంటే పేదరికంలో ఉన్న వారి దగ్గర మన ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఆరాట పడతాం.పక్క నున్న వారిపై పుకార్లు పుట్టిస్తాం.ఎవడో చెప్పిన చెడు ని విచక్షణ మరచి మరింతమందికి చెప్తాం.ఎదుటి వాడి మొహం పై మంచి మాటలు మాట్లాడి మనసులో మాత్రం వాడు మన కంటే పైకి ఎదగకూడదని బలంగా కోరుకుంటాం.అవసరాలు తీర్చుకోవటానికే అబద్ధపు బంధాలు ఏర్పరచుకుంటాం.అవసరం తీరాక వాటిని నిర్దాక్షణ్యంగా తెంచేస్తాం.మన కోసం ఆరాటపడే వారిని పట్టించుకోం.మనం ఇంకెవరి కోసమో,దేని కోసమో ఆరాటపడతాం.మనకేదైనా చెడు జరిగితే దానికి ఎవరినో బాధ్యులను చేస్తాం.నిజాన్ని అంగీకరించలేం అబద్ధానికి అలవోకగా ఆకర్షింపబడతాం.మనలోనే లోపాలను కుప్పలుగా ఉంచుకుని ఎదుటి వాడి తప్పులను ఎత్తి చూపిస్తాం.కిందపడిన వాడిని చూసి మొహం పై సానుభూతి చూపిస్తూ మనసులో మాత్రం విరగబడి నవ్వుతాం.వృద్ధాప్యం ఉంటుందనే విషయం మరచి యవ్వనపు అహంకారంతో విర్రవీగుతాం.జీవితం లో దెబ్బ తగిలిన వాడిని మాటలతో మరింత గాయపరుస్తాం,రాబందుల్లా పీక్కు తింటాం.ఎదుటి వాడి అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటాం.మనుషులను వ్యక్తిత్వాలని బట్టి కాకుండా వారి స్ధాయులను బట్టి గౌరవిస్తాం.పక్కనున్నోడి జీవితంలో తలదూరుస్తాం వాడి పరిస్థితేంటో తెలుసుకోకుండా నోటి కొచ్చిందంతా వాగుతాం.అందరం ఇలాగే ఉన్నామని కాదు కానీ అందరిలోనూ పైన చెప్పిన లక్షణాలలో కొన్నైనా తప్పకుండా ఉన్నాయి.మొత్తానికి మన నటనతో నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాం.రాక్షసానందం కావాలనుకునే వారికెవరికైనా మనం పాత్రధారులుగా ఉన్న ఈ నాటకం బోల్డంత వినోదాన్నిస్తుంది.

1 comment: